తెలంగాణకు తలమానికంగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి..నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలి: మంత్రి పొన్నం

తెలంగాణకు తలమానికంగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి..నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలి: మంత్రి పొన్నం

హైదరాబాద్ సిటీ, వెలుగు: గోషామహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి తెలంగాణకే తలమానికంగా నిలవనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. డ్రోన్ దృశ్యాలతో రూపొందించిన వీడియో ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించి, అధికారులతో చర్చించారు. ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే ఆధునిక వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపడుతున్నామన్నారు.

ఇప్పటికే 2 అంతస్తుల వరకు స్లాబ్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు, మేఘా ఇంజినీరింగ్ ప్రతినిధులకు సూచించారు. పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను వెంటనే పరిష్కరించాలని, పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతి నెలా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో వైద్య విద్యార్థుల హాస్టల్, ధర్మశాల, పరిపాలనా భవనం వంటి అనుబంధ సదుపాయాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు.

భవిష్యత్తులో పెద్ద అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సముదాయాలతో పాటు ఇతర నిర్మాణ ప్రాజెక్టుల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, వర్షపు నీటి ఇంకుడు గుంతలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని సరఫరా చేయడం ఒక్కటే హైదరాబాద్ భవిష్యత్తు నీటి అవసరాలకు పరిష్కారం కాదని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలన్నారు.

మరిన్ని వార్తలు